![](https://www.geni.com/images/facebook_white_small_short.gif?1736982065)
పలు సంస్కృత గ్రంధాలను తెలుగులోకి అనువదించిన పండితులు – కవులు ఎందరో ఉన్నారు. మారుతున్న కాల పరిస్థితులు, ప్రాంతీయ ప్రాముఖ్యతలననుసరించి, అనువాదకులు వారి, వారి అబిప్రాయాలు జోడించగా, మనకు లభ్యమవుతున్న గ్రంధాలన్నీ ఒక దానితో ఒకటి పోలటం లేదు. వేర్వేరు పురాణాలలో కథనం భిన్నంగా ఉండటం, అదే పురాణ గ్రంధంలో మరల ప్రస్తావన వచ్చినపుడు విభిన్నంగా ఉండటం, మన్వంతరాలలో అంతరాన్ని గణనలోకి తీసుకోకపోవట వలన కూడా మరికొంత సందిగ్ధత నెలకొంది. మహా కవులుగా పేర్కొన బడ్డ కవులు తమ శైలిలో గ్రంధాలు రచించి, ప్రసిద్ధి చెందినా, అవి సంస్కృత మూలానికి భిన్నంగా ఉండటం గమనించవచ్చు. ఆదికవి నన్నయ్య మహాభారతం మూల అనువాద శ్లోకానికి ఒక్కో పద్యం అన్న పద్ధతి పెట్టుకోలేదు. తిక్కన, ఎర్రనలు అదే ప్రణాళికను అనుసరించి అదే లక్ష్యంతో దాన్ని పూర్తి చేసారు. ఎవరి శైలి వారిది, స్వేచ్ఛానువాదాలే తప్ప యథామూలానువాదాలు అవతరించలేదు.
18వ శతాబ్దం, అంతకు ముందు వారు ఈ ప్రోజెక్ట్ లో చేర్చబడినారు.
తెలుగు సాహిత్యం యుగ విభజన ప్రముఖ కవుల జీవిత కాల ఆధారంగా విభజించబడినది.
ప్రాజ్ఞన్నయ యుగము (క్రీ. శ 1000 వరకు) - ముఖ్య కవి పండితులు – సర్వవర్మ, గుణాఢ్యుడు, హాలుడు, అమృత నాధుడు, క్షేమేంద్రుడు.
ఆంధ్రుల భాష గురించి కేవలం అక్కడక్కడ ఉన్న ప్రస్తావనల వలన (క్రీ. పూ. 28 నుండి క్రీ. త. 500 వరకు) అజ్ఞాత యుగము అని, శాసనాల వలన లభించిన ఆధారాల వలన (క్రీ. త. 500 నుండి 1000 వరకు) లబ్ధ సారస్వతము అని చెప్పబడినది. తెలుగు భాష లిపి ప్రత్యేకంగా (బ్రాహ్మీ లిపినుండి వేరుగా) అభివృద్ధి అయిన తార్కాణాలు లేవు. శాతవాహనుల కాలంలో తెలుగు ప్రజా భాషే గాని సారస్వత భాష కాదు, పండిత భాష కాదు. ఆనాటి రాజభాష ప్రాకృతము. పండిత భాష సంస్కృతము. కనుక తెలుగు సాహిత్యం అభివృద్ధి కావడానికి పెద్దగా ప్రోత్సాహం లభించక పోయి ఉండవచ్చును.
మొదటి శతాబ్దంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాథాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. 940 ప్రాంతంలో పంపన కాలంలో (10వ శతాబ్దం) తెలుగు భాష ఒక నిర్దిష్టమైన సాహిత్య భాషగా లిఖిత రూపంలో కనిపించిందని పరిశోధనల్లో తేలింది.
నన్నయ యుగము (1000 నుండి 1100 వరకు) - ముఖ్య కవి పండితులు – నన్నయ, నారాయణ భట్టు, వేములవాడ భీమకవి, అధర్వణుడు.
తెలుగు సాహిత్యం వేళ్లూనుకొని మహావృక్షంగా విస్తరించింది. తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యానికి తొలిపలుకులు పలికారు. 11వ శతాబ్దంలో కవిత్రయంలో మొదటి వాడైన నన్నయ్య మహాభారతాన్ని తెనిగించడం ప్రారంభించే వరకు ప్రఖ్యాతి కాంచి, ప్రాచుర్యంలోకి వచ్చిన సాహిత్య కార్యకలాపాలు జరగలేదు. వేములవాడ భీమకవి, అధర్వణుడు, పావులూరి మల్లన ఈ కాలం వారు కావచ్చని అభిప్రాయాలున్నా నిర్ధారించబడలేదు.
శివకవి యుగము (1100 నుండి 1225 వరకు) - ముఖ్య కవి పండితులు – నన్నెచోడుడు, పాల్కురికి సోమనాధుడు, మల్లికార్జున పండితారాధ్యుడు అనబడు శివ కవిత్రయం, పావులూరి మల్లన, శ్రీపతి, యథావాక్కుల అన్నమయ్య.
ఈ యుగం నన్నయకు, తిక్కనకు సంధికాలం. ఈ కాలంలో రచనా వస్తువు శివగాధామయం. భాషలో సంస్కృత ప్రాబల్యం తగ్గి తెలుగు వాడుక హెచ్చింది.
తిక్కన యుగము (1225 నుండి 1320 వరకు) - ముఖ్య కవులు – తిక్కన సోమయాజి, వేములవాడ భీమకవి, మూల ఘటిక కేతన, మంచన, మారన, గోన బుద్ధారెడ్డి.
కవిత్రయంలో రెండవవాడు తిక్కన సోమయాజి ఈ యుగానికి ప్రధాన కవిగా గుర్తింపు పొందాడు. ఈ యుగంలో పురాణ ఖండాలు, వచన కావ్యాలు, ప్రాకృత నాటకాలు ప్రబంధీకరింపబడడం మొదలయ్యింది. శతక కవిత్వం వర్ధిల్లింది. శైవ కవిత్వంలో ఉన్న పరమత దూషణ, స్వమత మౌఢ్యత తగ్గాయి. ఎక్కువగా ప్రబోధాత్మక రచనలు వెలువడినాయి.
ఎర్రన యుగం (1320 నుండి 1400) - ముఖ్య కవులు – ఎఱ్ఱాప్రగడ ఎర్రన, భాస్కరుడు, నాచన సోమన, చిమ్మపూడి అమరేశ్వరుడు.
ఈ యుగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. గ్రాంథిక, పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది.
శ్రీనాధ యుగం (1400 నుండి 1500 వరకు) - ముఖ్య కవులు – శ్రీనాథుడు, పోతన, బొప్పరాజు గంగన్న, ఏర్చూరు సింగన, వెలిగందల నారయ, మడికి సింగన, దగ్గుపల్లి దుగ్గన, నంది మల్లయ, ఘంట సింగన, పిల్లలమర్రి పిన వీరభద్రుడు, తాళ్లపాక అన్నమయ్య.
ఈ యుగాన్ని తెలుగు సాహిత్యంలో ఒక సంధి యుగంగా భావించవచ్చు. ఈ కాలంలో పురాణ కవుల కావ్యానువాద విధానం కొనసాగింది. తరువాత వచ్చిన ప్రబంధ యుగానికి నేపథ్యంగా నిలిచింది. తాళ్లపాక కవులు వారి జీవిత కాలం ప్రకారం శ్రీనాధ / రాయల యుగంలో చేర్చబడినారు.
రాయల యుగము (1500 నుండి 1600 వరకు) - ముఖ్య కవులు – – అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు, కొరవి గోపరాజు.
రాయల యుగాన్ని ప్రబంధ యుగంగా పరిగణిస్తారు. ఆముక్తమాల్యద రచించిన కృష్ణదేవరాయలు కూడా కవుల కోవకే చెందుతాడు.
దాక్షిణాత్య యుగము (1600 నుండి 1775 వరకు) - ముఖ్య కవులు – రఘునాథ నాయకుడు, చేమకూర వెంకటకవి, ఎలకూచి బాలసరస్వతి, కాకునూరి అప్పకవి, కాణాదం పెద్దన సోమయాజి.
దక్షిణాంధ్ర యుగ సాహిత్యంలో చెప్పుకోదగ్గ కృషి తంజావూరు నాయక రాజులు చేసారు. ఆచ్యుతప్ప నాయకుని కుమారుడు రఘునాథ నాయకుడు (1613 - 1631) తెలుగు భాషకు చేసిన సేవ చాలా గొప్పది. అతని పుత్రుడు విజయ రాఘవుడి ఆస్థానంలో విదుషీమణులు కూడా గొప్ప పేరు తెచ్చుకున్నారు. చంద్రరేఖ. కృష్ణాతజీ, పసుపులేటి రంగాజమ్మ వారిలో ముఖ్యులు.
క్షీణ యుగము (1775నుండి 1875 వరకు) - ముఖ్య కవులు - C P బ్రౌన్, కూచిమంచి తిమ్మకవి, అడిదము సూరకవి, ఏనుగు లక్ష్మణ కవి మొదలగువారు.
ఆధునిక యుగము (1875 తరువాత)